Pages

Menu Bar

RT

Thursday, May 5, 2011

కాశ్మీర్‌లో మన కర్తవ్యం - కె. బాలగోపాల్‌ వ్యాసకర్త

అవి దేశ విభజన రోజులు. ఉపఖండమంతటా -ముఖ్యంగా ఉత్తర, వాయవ్య, తూర్పు ప్రాంతాల లో నరమేధం జరుగుతున్నది. హిందూ, సిక్కు మూకలు ముస్లింలను, ముస్లిం మూకలు హిందువులనూ సిక్కులనూ నరుకుతున్నారు, సజీవంగా కాల్చి చంపుతున్నారు. ఇళ్ళు తగుల బెడుతున్నారు. స్త్రీలను రేప్‌ చేస్తున్నారు. ఇంతటి హింసను ఉపఖండం అప్పటివరకు చూసి ఎరుగదు. ఆ సమయంలో ఢిల్లీ నుంచి ఒక పెద్దాయన కాశ్మీర్‌ వెళ్లా డు. అక్కడి ప్రశాంతత చూసి ఆయన ఆశ్చర్యపోయాడు. పక్కనే ఉన్న జమ్మూలోను, కొత్తగా ఏర్పడ్డ సరిహద్దుకు ఆవలనున్న పాకిస్థాన్‌లోనూ రక్తం ఏరులయి పారుతున్నా, కాశ్మీర్‌లో చిన్న మైనారిటీగా ఉన్న హిందువులు, సిక్కులు భద్రం గా ఉన్నారు. స్వల్పమైన మత ఘర్షణలు సహితం లేవు.

ఆ పెద్దాయన కాశ్మీరీలను అందుకు అభినందిస్తూ జమ్మూలో హింసను అరికట్టలేకపోయిన మహారాజా హరిసింగ్‌ గద్దె దిగి షేక్‌ అబ్దుల్లాకు అధికారం అప్పగించాలని పత్రికా ముఖంగా డిమాండ్‌ చేశాడు. ఆయన 'హిందువుల ప్రయోజనాలను వ్యతిరేకించే కమ్యూనిస్టు' కాదు, త్రిపురనేని హనుమాన్‌ చౌదరి కంటే ప్రగాఢమైన రామభక్తి గలవాడు. ఆయనను మహాత్మా గాంధీ అంటారు. ఆ నాటి నుంచి ఈనాటి దాకా దేశంలో మత ఘర్షణలు ఎప్పుడూ జరగని అతి కొద్ది ప్రాంతాలలో కాశ్మీర్‌ ఒకటి. గడచిన నెలరోజులుగా నెలకొన్న తీవ్ర ఉద్రిక్తత మధ్య కూడ అమర్‌నాథ్‌ యాత్ర ఎప్పటిలాగే సాగింది, సాగుతున్నది.

యాత్రికులకు ఎప్పటిలాగే స్థానిక ప్రజల సహాయ సహకారా లు అందుతూనే ఉన్నాయి. ఈ సంవత్సరం ఎప్పుడూ లేనం త సంఖ్య -దాదాపు 5 లక్షల మంది - అమర్‌నాథ్‌కు వెళ్లా రు. వాళ్లపైన దాడికాదు సరికదా ఎటువంటి అసౌకర్యమూ కలగలేదు. సినిమా షూటింగ్‌కు పోయిన తెలుగు సినిమా వారి మీద మాత్రమే పహల్గాంలో రాళ్లు పడ్డట్టున్నాయి. అయినా 'నాలుగు లక్షల మంది కాశ్మీరీ పండిట్‌లు కాశ్మీర్‌లోయ వదిలిపెట్టి పోలేదా?' అని హనుమాన్‌ చౌదరి అడుగుతున్నారు. నాలుగు లక్షల మంది పోలేదుగానీ రెండు లక్ష ల పైగా పోయిన మాట వాస్తవం. దీనికి కారణం హిందువు ల మీద దాడులు జరగడం అనుకుంటే పొరబాటే.

1989లో మొదలైన మిలిటెన్సీ తన రాజకీయ ప్రత్యర్ధులను ఏరి ఏరి హతమార్చింది. అందులో కొందరు పండిట్‌లు ఉన్నారు. అత్యధికం నేషనల్‌ కాన్ఫరెన్స్‌, కాంగ్రెస్‌ తదితర పార్టీలకు చెందిన ముస్లింలున్నారు. కాశ్మీరీ ముస్లింలు గుంపులుగా పండిట్‌ల పైన దాడి చేసిన ఒక్క ఘటనా జరగలేదు. ఆనాటి నుంచి ఈనాటి దాకా కాశ్మీర్‌లో సైన్యం చేతిలోనూ మిలిటెం ట్ల చేతిలోనూ ప్రభుత్వ అనుకూల సాయుధ బృందాల చేతిలోనూ చనిపోయిన వారి సంఖ్య వివిధ అంచనాల ప్రకారం 50 వేల నుంచి 80 వేల దాకా ఉంది. అందులో పండిట్‌ల సంఖ్య 300 మించి లేదు. మిగిలిన వారంతా- ఎవరి చేతిలో చచ్చినా- కాశ్మీరీ ముస్లింలే.

మిలిటెన్సీ కాశ్మీరీ సంస్థల చేతి నుంచి పాకిస్థాన్‌ కేంద్రంగా గల ఇస్లాం వాద సాయుధ సంస్థ ల చేతిలోకి పోయిన తరువాత మిలిటెంట్లు మూకుమ్మడిగా నిరాయుధులను చంపిన ఉదంతాలు జరిగాయి, జరుగుతున్నాయి గానీ అంతకు ముందు అది కూడ లేదు. అయినప్పటికీ పండిట్‌లు పెద్ద సంఖ్యలో పారిపోవడానికి తమ భవితవ్యాన్ని గురించి ఏర్పడిన అభద్రతా భావం కారణం. లక్షల మంది వీధులలోకి వచ్చి ఇండియా-వ్యతిరేక నినాదాలిస్తున్నారు. కొందరు పాకిస్థాన్‌ అనుకూల నినాదాలు ఇస్తున్నారు. ప్రభుత్వ వ్యవస్థ కుప్ప కూలిపోయింది.

పండిట్‌లు కాశ్మీర్‌లోయ విడిచిపెట్టి పోవాలన్న పోస్టర్లు కొన్ని చోట్ల పడ్డాయి. దీనికి పండిట్‌లు భయపడటం సహజం. ఆ స్థితిలో ప్రభుత్వం వారికి భరోసా ఇచ్చి వుంటే పండిట్‌ల వలస జరిగి ఉండేది కాదే మో గానీ అప్పటి గవర్నర్‌ జగ్‌మోహ న్‌ ఆలోచనారీతి ప్రస్తుత సంక్షోభానికి కారకుడైన గవర్నర్‌ సిన్హా ఆలోచనారీతి లాంటిదే. పండిట్‌లను ప్రభుత్వం కాపాడజాలదనీ వారి భద్ర త కోసం వారు లోయను విడిచిపెట్టి వెళ్లిపోవడం ఉత్తమమనీ రాష్ట్ర గవర్నర్‌ స్వయంగా ప్రకటించడం పండిట్‌ల భయాన్ని మరింత పెంచి భారీ వలసకు దారితీసింది. 








Tags: కాశ్మీర్‌లో మన కర్తవ్యం - కె. బాలగోపాల్‌ వ్యాసకర్త, కె. బాలగోపాల్‌ వ్యాసాలు, వ్యాసాలు.



No comments:

Post a Comment

Followers