ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమిషన్ నిర్వహిస్తున్న అన్ని రకాల పోటీ పరీక్షలలో జనరల్ స్టడీస్ తప్పనిసరి సబ్జెక్ట్‌గా ఉంటున్నది. అదే విధంగా పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్, విద్యా శాఖ, ఇంజనీరింగ్ తదితర డిపార్ట్‌మెంట్స్ నిర్వహించే పోటీ పరీక్షలలో కూడా జనరల్ స్టడీస్ ఒక సబ్జెక్ట్‌గా ఉండడం వల్ల పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్ధులు జనరల్ స్టడీస్‌ను శాస్త్రీయ పద్దతిలో ప్రణాళికాబద్ధంగా అధ్యయనం చేయాలి. నిజానికి జనరల్ స్టడీస్ సిలబస్ పరంగా పరిమితంగా ఉన్నప్పటికి పరిధి మాత్రం అపరిమితం. అందువల్ల ఎన్ని సం॥ పాటు ఎంత చదివినా ఇంకా తెలియని విషయాలు చాలా ఉంటాయి. అందువల్ల పరీక్ష కోణంలో ముఖ్యమైన అంశాలను గుర్తించడం, ప్రశ్నల సరళిని పరిశీలించడం, నిపుణుల సలహాలు తీసుకోవడంతో (అవకాశం ఉంటే కోచింగ్ తీసుకోవడం), పాటు ప్రామాణికమైన పుస్తకాలను ఎంపిక చేసుకొని సమగ్రంగా ప్రిపేర్ అయితే జనరల్ స్టడీస్‌పై పట్టు సాధించడం వీలవుతుంది. జనరల్ స్టడీస్ ఒక సముద్రం లాంటిది ఎంత చదివినా ఉపయోగం తక్కువనే అపోహ ఉంది. కాని సముద్రంలో మనకు కావలసిన చేపలను మాత్రమే (ముఖ్యమైన అంశాల ను) గుర్తించగలిగే స్మార్ట్ వర్క్ అవసరం. జనరల్ స్టడీస్ జీవి తంలో మనకు తెలియని అనేక విషయాలను వివరిస్తుంది కాబట్టి దీనిని ఇష్టంతో, సృజనాత్మక దృష్టితో చూడగలిగితే ఎక్కువ మార్కులు పొందవచ్చు.జనరల్ స్టడీస్‌లో జనరల్‌సైన్స్ అత్యంత కీలకమైన విభాగం. ఈ విభాగం నుండి సుమారు 30 నుండి 35 ప్రశ్నలు రావడానికి అవకాశముంది. పోటీపరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్ధులలో ఎక్కువ మంది ఈ విభాగం గురించి భయపడ తారు. నిజానికి ఈ విభాగంలో అంశాలను భావనాత్మకంగా, తార్కికంగా హేతుబద్దంగా ఒకసారి అర్ధం చేసుకోగలిగితే ఎక్కువ కాలం పాటు గుర్తుంటాయి. అదే విధంగా పరోక్షంగా వచ్చే ప్రశ్నలకు కూడా సమాధానాలను సులభంగా గుర్తించ వచ్చు. అందువల్ల సైన్స్ నేపథ్యం లేని అభ్యర్ధులు జనరల్ సైన్స్‌ను జనరల్‌గా చదివినా కూడా అర్ధమవుతుందని గుర్తుంచు కోవాలి. (సిలబస్‌లో కూడా జనరల్‌గా పేర్కొన్నారు). సిలబస్ శాస్త్ర, సాంకేతిక రంగాల్లో సమకాలీన అభివృద్ధి వాటి ప్రభావం, ప్రత్యేకంగా సైన్స్‌ను ఒక అంశంగా చదవకపోయినా విద్యావంతుడైన అభ్యర్ధికి తెలిసి ఉండాల్సిన అనుదిన విజ్ఞాన పరిశీలన, అనుభవ పూర్వక విషయాలపై అవగాహన. జనరల్ సైన్స్ సిలబస్ స్వభావం? జనరల్ సైన్స్ సిలబస్‌లో సమకాలీన విజ్ఞానానికి సంబంధించిన అంశాలను పేర్కొన్నారు. అయితే ఏదైనా ఒక అంశం యొక్క సమకాలీన విషయం. అనువర్తనం అర్ధం కావాలంటే మొదట ఆ అంశానికి సంబంధించిన మౌలిక విషయాలు తెలియాలి కాబట్టి శాస్త్ర సాంకేతిక రంగాలలో సమకాలిన అభివృద్ధిని అర్ధం చేసుకోవాలంటే సైన్స్ మౌలికాం శాలను అధ్యయనం చేయాలి. తరువాత వాటి అనువర్తనాలపై ప్రధానంగా దృష్టి సారించాలి. పరీక్షల్లో కూడా దాదాపు 50శాతం మౌలికాంశాలు. 50శాతం అనువర్త నాంశాలను ప్రత్యక్షంగా, పరోక్షంగా అడగటం జరుగుతుంది. అందువల్ల మౌలికాంశాలకు, అనువర్తనాలకు సమాన ప్రాధాన్యమివ్వాలి. ఏయే విభాగాలకు ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వాలి? జనరల్ సైన్స్‌లో ప్రధానంగా జంతుశాస్త్రం, వృక్షశాస్త్రం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, సైన్స్ అండ్ టెక్నాలజీ మొదలగు విభాగాలు ఉంటాయి. వీటిలో జంతుశాస్త్రం మరియు భౌతిక శాస్త్రం నుండి ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి. వీటితోపాటు పర్యావరణ శాస్త్రం, అనువర్తన జీవశాస్త్రం వంటి శాస్త్రాల గురించి కూడా తెలుసుకోవాలి. ఈ విభాగం నుండి వచ్చే మొత్తం 30/35 ప్రశ్నలలో ఈ కింది విధంగా ప్రశ్నలు రావడానికి అవకాశముంది. జంతుశాస్త్రంలో మౌలికమైన అంశాలు? జీవశాస్త్రంలో ముఖ్యమైన విభాగం జంతుశాస్త్రం. ఇందు లో ఏకకణ సరళ జీవి అయిన అమిబా మొదలు మానవుని వరకు అనేక కోట్ల జీవరాశులు ఉంటాయి. జంతు రాజ్యంలో వున్న ప్రధాన శాఖలైన అకశేరుకాలు, సకశేరుకాలు, వాటిలోని ఉపశాఖల ముఖ్యమైన లక్షణాలను తెలుసుకోవాలి. అకశేరుకాలలో ప్రోటోజోవా, పోరిఫెరా, సిలెంటి రేటా, ప్లాటి హెల్మింథిస్, నిమాటి హెల్మింథిస్, అనెలిడా, ఆర్దోపొడ, మలస్కా, ఇకైనో డెర్మెటాల మౌలిక లక్షణాలను అదే విధంగా జీవులు యొక్క ఆర్థిక ప్రాముఖ్యతను, ముఖ్యమైన జీవుల పేర్లను తెలుసుకోవాలి. గతంలో వీటి నుండి సులభమైన ప్రశ్నలను ఎక్కువగా అడగటం జరిగింది. ప్రశ్నల స్వభావం 1. అమీబియాసిస్ ను కలిగించే ప్రోటోజోవా పరాన్న జీవి? జ. ఎంటమిబా హిస్టాలైటికా 2. బాత్ స్పాంజ్‌లు ఏ విభాగంలో ఉంటాయి? జ. పొలిఫెరా 3. పగడపు దిబ్బలు, ప్రవాళ బిత్తికలు ఏ విభాగంలో ఉంటాయి? జ. సిలెంటిరేటా అకశేరుకాల నుండి ప్రధానంగా వర్గం యొక్క ముఖ్య లక్షణం, ముఖ్యమైన జీవి. ఆర్థిక ప్రాముఖ్యం గల జీవి గురించి ఎక్కువగా ప్రశ్నలు రావడానికి అవకాశముంది. సకశేరుకాలలో చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు ఉంటాయి. వీటిలో కూడా వర్గం యొక్క ముఖ్యమైన లక్షణా లు, ఆర్థిక ప్రాముఖ్యంగల జీవుల గురించి తెలుసుకోవాలి. మానవుడు క్షీరదాల వర్గానికి చెందినందున క్షీరదాల గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఇక మానవుని శరీర ధర్మశాస్త్రం పరీక్ష కోణంలో కీలకమైన అంశం. ఇందులో జీర్ణవ్యవస్థ (పోషణ), రక్తప్రసరణ వ్యవస్థ. శ్వాసవ్యవస్థ, నాడీవ్యవస్థ, అస్థిపంజర వ్యవస్థ, హార్మోన్లు, జ్ఞానేంద్రియాలకు సంబంధించిన అంశాల నుండి గత ప్రశ్నాపత్రాలలో ఎక్కువగా ప్రశ్నలు రావడం జరిగింది. ముఖ్యంగా రక్తవర్గాలు, విటమిన్లు, హృదయ సం బంధ వ్యాధులు, కన్ను, చెవి, నిర్మాణం. హార్మోన్ల లోపం వల్ల తలెత్తే సమస్యల గురించి ఎక్కువగా ప్రశ్నలు రావచ్చు. 1. మలేరియా నిర్మూలన కార్యక్రమంలో సాధారణంగా ఉపయోగపడు చేప? జ. గాంబుషియా యఫినిస్ (గూప్-1, 200) 2. చెవి ఎముకల మొత్తం? జ. 6 నగూప్-2, 200) 3. శరీరంలో వార్తలను గ్రహించి, విశ్లేషించి సమన్వయ పరిచే కేంద్రం? జ. మెదడు (జూనియర్ లెక్చరర్స్ - 2007) జంతు శాస్త్రం సిలబస్ విస్తృతంగా ఉన్నప్పటికి గత ప్రశ్నాపత్రాల విశ్లేషణ ఆధారంగా చూస్తే పరీక్ష కోణంలో ముఖ్యమైన అంశాల నుండే ప్రశ్నలు పునరావృత మవుతు న్నాయి. అందువల్ల అభ్యర్ధులు శాస్త్రీయ పద్ధ్దతిలో అధ్యయనం చేయాలి. జంతుశాస్త్రంకు అనుబంధంగా కణజీవ శాస్త్రం, జన్యుశాస్త్రం, ఆవరణ శాస్త్రం లాంటి విభాగాలను కూడా అధ్యయనం చేయడం తప్పనిసరి. వృక్షశాస్త్రంలో ముఖ్యమైన అంశాలు? పరీక్ష కోణంలో వృక్షశాస్త్రం పాత్ర తక్కువగా ఉన్నప్పటికీ జీవుల మనుగడ విషయంలో మాత్రం ఈ శాస్త్రం అత్యంత కీలకమైనది. సమస్త జీవరా శులు జీవించి ఉండటానికి అవసరమైన ఆక్సిజన్‌ను అందించడంతో పాటు జీవులు విడుదల చేసిన కార్బన్ డై అక్సైడ్‌ను మొక్కలు పీల్చుకొని వాతావ రణ సమతుల్యతను కాపాడుతున్నాయి. వృక్ష రాజ్యంలో ప్రధానంగా శైవలాలు శిలీం ధ్రాలు, బ్రయోఫైటా, టెరిడోఫైటా, వివృత బీజాలు, ఆవృత బీజాలు అనే విభాగాలు ఉంటాయి. ఈ విభాగాల ముఖ్యమైన లక్షణాలను అదే విధంగా మొక్కల ఆర్థిక ప్రాముఖ్యతను ఎక్కువగా అడగటం జరుగుతున్నది. వృక్ష రాజ్యంలో అతి చిన్న మొక్కలు శైవలాలు. ఇవి నాచు రూపంలో ఉంటాయి. సముద్రంలో ఉండే గోధుమ రంగు శైవలాలు అయోడిన్‌ను ఉత్పత్తి చేయగా, నాస్తాక్, అనాబినా వంటి నీలి ఆకుపచ్చ, శైవలాలు నత్రజని స్థాపనలో పాల్గొంటా యి. ఇలా ప్రతి విభాగంలో మానవునికి ఉపయోగపడే ముఖ్యమైన మొక్కల గురించి తెలుసుకోవాలి. చాలా మంది అభ్యర్ధులు మొక్కల శాస్త్రీయ నామాలు కూడా గుర్తించుకో వడానికి ఎక్కువ సమయం కేటాయిస్తారు. కాని పరీక్ష కోణంలో అతి ముఖ్యమైన మొక్కల శాస్త్రీయ నామాలు గుర్తుంచుకుంటే సరిపోతుంది. (ఉదా॥ వేప - అజాడిరక్టా ఇండికా, వరి-ఒరైజ సటైవా) ఏయే అంశాలకు ప్రాధాన్యతనివ్వాలి? వృక్ష రాజ్యంలోని వివిధ విభాగాల ముఖ్యమైన లక్షణాలు, ప్రధానంగా వృక్ష శరీర ధర్మశాస్త్రం, ఆర్థిక వృక్ష శాస్త్రం, ఆవరణ శాస్త్రం, కణజీవ శాస్త్రం, జన్యుశాస్త్రం నుండి ఎక్కువ ప్రశ్నలు రావడానికి అవకాశముంది. వృక్ష శరీర ధర్మ శాస్త్రంలో కిరణజన్య సెంెూగక్రియ, మొక్కల పోషణ, శ్వాసక్రియ, జలరవాణా, భాష్పోత్సకం, వృక్ష హర్మోన్ల పాత్ర, ప్రత్యుత్పత్తి వ్యవస్థ నిర్మాణం తదితర అంశాల నుండి గతంలో ప్రశ్నలు ఎక్కువగా పునరావృత మయ్యాయి. ఈ మధ్యకాలంలో జరిగిన పోటీ పరీక్షలలో ఆర్థిక వృక్షశాస్త్రం, పర్యా వరణ శాస్త్రం, అడవులు, కాలుష్య నివారణ, జీవ వైవిధ్య సంరక్షణ వంటి అంశాల గురించి ఎక్కువగా ప్రశ్నలడు గుతున్నారు. ఎలా చదవాలి? వృక్ష శాస్త్రం అనగానే చాలామంది ఇది డ్రై సబ్జెక్ట్ అని, బోర్ సబ్జెక్ట్ అని ఫీలవుతారు. వాస్తవానికి ఇది చాలా ఇంట్రెస్ట్ సబ్జెక్ట్. మానవుని జననం మొదలు మరణం వరకు ప్రతి సంఘటనను మొక్కలు ప్రత్యక్షంగానో, లేదా పరోక్షంగానో ప్రభావితం చేస్తాయి. అందువల్ల మొక్కలు మానవునికి ఉపయోగపడు తున్న తీరును తెలుసుకోగలిగితే వృక్షశాస్త్రం అర్థమయినట్లే. ప్రశ్నలు కూడా ఎక్కువగా డైరెక్ట్‌గా ఉంటాయి. కొన్ని సందర్భాలలో మాత్రం అనువర్తనాలను అడగటం జరుగుతుంది. కాబట్టి మొదట మౌలికాంశాలను అధ్యయనం చేసి మొక్కల ఉపయోగాలను తెలుసుకుంటే వృక్షశాస్త్రంలో దాదాపు అన్ని ప్రశ్నలకు సమాధానాలను గుర్తించవచ్చు. ప్రశ్నల సరళి ఎలా ఉంటుంది? వృక్షశాస్త్రం నుండి వచ్చే 4-6 ప్రశ్నలలో 3 ప్రశ్నలు చాలా సరళంగా ఉంటాయి. మిగతావి అనువర్తన కోణంలో ఉండటానికి అవకాశముంది. అంతే కాకుండా ముఖ్యమైన అంశాల నుండే ప్రశ్నలు ఎక్కువగా పునరావృతమ వుతున్నాయి. కాబట్టి మొదట ఈ అంశాలను క్షుణ్ణంగా అద్యయనం చేయాలి. 1. మొక్కలు నీటిని పోగొట్టుకొను ప్రక్రియ? జ. బాష్పోత్సేకం గ్రూప్-1, 200) 2. మొక్కలోని ఏ భాగం నుంచి మార్ఫిన్ వస్తుంది? జ. పుష్పం నగూప్-2, 2003) 3. భారత కేంద్రీయ వరి పరిశోధనా సంస్థ ఎక్కడ ఉంది? జ. కటక్ (జె.ఎల్. - 2004) వృక్ష శాస్త్రంలో ఆధునిక ధోరణులు గత దశాబ్ద కాలంలో వృక్షశాస్త్రంలో ఆర్థిక వృక్షశాస్త్రం, ఔషధ మొక్కల పాత్ర గణనీయంగా పెరిగింది. అందువల్ల ఈ విభాగం నుండి కనీసం 2 ప్రశ్నలను తప్పనిసరిగా అడుగుతున్నారు. అయితే మానవునికి ఎక్కువగా ఉపయోగపడుతున్న మొక్కల గురించి తెలుసుకుంటే సరిపోతుంది. వేప, ఉసిరి, కలబంద, రావుల్పియా వంటి ఔషధ మొక్కల ఉత్పన్నాలు ఎక్కువగా మార్కెట్‌లోకి వస్తున్నాయి. అందువల్ల వీటి ఉత్పన్నాలు వాటి ఉపయోగాలను తెలుసుకోవాలి. ఇక కూరగాయలు వాటి భాగాలు గురించి తెలుసుకోవాలి. ఉదా : ఉల్లిలో మనం తినే భాగం, రసవంతమైన పత్రపీఠాలు, ఆలుగడ్డలో కాండం, క్యారెట్‌లో వేరు తినదగిన భాగాలు. ఇలా ముఖ్యమైన వాటి గురించి తెలుసుకోవాలి. జీవశాస్త్రంలో ఇతర అంశాలు జీవ శాస్త్రంలో జంతుశాస్త్రం, వృక్షశాస్త్రంతో పాటు సూక్ష్మజీవశాస్త్రం, జీవ రసాయన శాస్త్రం, బయో ఇన్ఫర్మేటిక్స్ వంటి ఇతర శాఖలు కూడా ఉన్నాయి. సూక్ష్మజీవ శాస్త్రంలో బాక్టీరియా వైరస్‌ల గురించి ముఖ్యంగా ఇవి కలిగించే వ్యాధుల గురించి తెలుసుకోవాలి. వ్యాధి శాస్త్రంలో జంతువులు, మొక్కలకు కలిగే వివిధ రకాల వ్యాధులు గురించిన సమాచారం ఉంటుంది. వీటి నుండి కూడా ప్రశ్నలు వస్తాయి. ఎలాంటి పుస్తకాలు చదవాలి? జీవశాస్త్రం గురించి సంపూర్ణ అవగాహన రావాలంటే అభ్యర్ధులు స్టేట్ సిలబస్ 6 నుండి 10వ తరగతి వరకు గల సైన్స్ పుస్తకాలను చదవాలి. వీటితోపాటు పోటీపరీక్షల కొరకు రూపొందించిన ప్రామాణిక పుస్తకాలను కూడా చదవడం మంచిది. చదివిన విషయాలను ముఖ్యంగా పరీక్ష కోణంలో ముఖ్యమైన అంశాలను పాయింట్ల రూపంలో, పట్టికల రూపంలో రాసుకొని ఎక్కువసార్లు రివిజన్ చేయాలి. గత ప్రశ్నాపత్రాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి సైన్స్‌కు సంబంధించిన వర్తమాన విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. కరెంట్ అఫైర్స్‌లో సైన్స్‌కు సంబంధించిన విషయాలను కూడా సంబంధిత అంశానికి అనుబంధంగా రాసుకుంటే మౌలికాంశాలు, అనువర్తనాలు ఒకే దగ్గర ఉండి, ప్రశ్న ఏ విధంగా అడిగినా సమాధానం గుర్తించడం సులభమవుతుంది. నిరంతర సాధన ఎప్పటికప్పుడు నూతన విషయాలను తెలుసుకోవాలన్న తపన ఉంటే సైన్స్‌లో ఎక్కువ మార్కులు పొందవచ్చు
Tags:APPSC, appsc study material free download,appsc study circle,appsc study material for industrial promotion officer,appsc study material
Scores : Namaste Telangana
Tags:APPSC, appsc study material free download,appsc study circle,appsc study material for industrial promotion officer,appsc study material
No comments:
Post a Comment